Saturday, 19 May 2018

PARENTING TODAY పేరెంటింగ్ టుడే

ఈరోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏమి నేర్పిస్తున్నారో ఒకసారి ఆలోచించాలి .వారు పనికిరాని మీటింగులలో కూర్చోని ఒకరి గురించి ఇంకొకరి దగ్గర ,వారు లేనపుడు ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు  కల్పించి చులకనగా ,హేళనగా మాట్లాడుకుంటూ విమర్శించుకుంటూ టైం పాస్ చేస్తూ ఉన్నపుడు తమ పిల్లలు అక్కడే వారి వొడిలోనో ,దగ్గర్లో ఆడుకుంటూనో ఉంటారు కదా .ఆ పనికి మాలిన మాటలు వింటూ పెరుగుతారు కదా .సభ్య సమాజం మాట పక్కన ఉంచితే ,మీ పిల్లలకు, భావి తరాలకు మీరు మంచి నేర్పించక పోగా వారి పరోక్ష ఙ్ఞానం అనే బ్యాంకు ఖాతా లో ఈ నెగటివ్ భావాలు  జీవిత కాలం ఉండేలా  ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు .

ఇలా నష్టం తమకే ,తమ పిల్లలకే జరుగుతుంది అని తెలియదు .తెలుసుకోవాలి అని ప్రయత్నించాలి అంటే తమకు  ఫలానా విషయం గురించి  తెలియదు అని తెలియాలిగా ,ఒకవేళ తెలియదు అని తెలిసినా ,తెలియని విషయాన్ని తెలియదు అని ఒప్పుకొవాలిగా .
ఏమంటారు ??
మీ పిల్లలను అల్లరి చేసినపుడు శిక్షిస్తున్నారు సరే .మరి మంచి పనులు చేసినపుడు అభినందిస్తున్నారా ?? లేక మనకు ఎందుకు అని  వెనక్కి లాగేస్తున్నారా ???

ఉదాహరణకు మీ పక్కింటికి కొత్తగా ఎవరో అద్దెకి వచ్చారు అనుకోండి .వారి ఇంటికి కొత్త బీరువా రిక్షా లో డెలివరీ వచ్చింది అనుకోండి .వారి ఇంట్లో మనుషులు అందరు లేరు కనుక ఇంట్లోకి బీరువా సాయం పట్టమని అడిగారు మీ పన్నెండేళ్ల అబ్బాయిని .మీ వాడు వెంటనే సరే అని సాయం చేయబోయాడు .దగ్గర్లోనే ఉన్న మీరు అది గ్రహించారు .వేంటనే ..ఒరేయ్ బన్నీ ...ఇటు రా ఒకసారి ..అన్నారు ." ఏం చేస్తున్నావ్ ??" అడిగారు మీరు (ఏం తెలియనట్లుగా )
మీరు తెలిసి కుడా తెలియనట్లు అడిగారు అని తెలియని అమాయకత్వం తో మొత్తం వివరించాడు మీకు .
బీరువా నా ? నువ్వు మొయ్యలేవు ..(నెగటివ్ హెటిరో  సజెషన్ ) "డాడీ ఊరుకోరు ..కొడతారు అలాంటి పనులు చేస్తే .." అని చెప్పు .అన్నారు మీరు తెలివిగా (మీ భావన మాత్రమే ).

లోపల చేయాలి హెల్ప్ అని అనిపిస్తున్నప్పటికీ మీ మాటకి ఒప్పుకొని ఆవే మీరు చెప్పి పంపిన డైలాగులే చెప్పి ఆ పని నుండి తప్పించుకొని వచ్చేసాడు .మీకు లోపల ఆనందం - చెప్పినట్లు చేసాడు కనుక .వాడికి లోపల తెలియకుండానే విషపు నాట్లు
రెండో సారి ..మూడోసారి కూడా ఏదో మరేదో సందర్భం లో మీరు ఇతరులకు సాయం చేయబోయినపుడు మీ అబ్బాయ్ ని వెనక్కి లాగేసారు మీరు .

నాలుగోసారి కూడా అలాంటి సందర్భమే ఎదురైంది .కానీ మీ వాడు మీ ప్రమేయం లేకపోయినా ఆ పని నుండి తప్పించుకున్నాడు (మీరేగా నేర్పించారు మరి )
ఈసారి మంచిపనులు చేసేటపుడు సాకులు చెప్పి తప్పించుకోవడం చాలా తెలివిగా చేస్తుంటాడు .బీరువ మోయటానికి హెల్ప్ అడిగితే - క్రికెట్ ఆడినపుడు కాలు బెణికింది అంకుల్ అంటాడు .షాప్ కు వెళ్ళి ఆయిల్ తీసుకురామంటే - హోంవర్క్ చాలా ఉంది మమ్మీ అంటాడు .తిరిగి తిరిగి మీకే తగులుతుంది ఆ బూమెరాంగు .
             చెడు చేయొద్దు అని వారించకపోవడం ఎంత తప్పో మంచి చెయొద్దు (మంచిగా ఉంటే అవతలివారు మనల్ని వారి పనికి  ఉపయోగించుకొని విడిచిపెట్టేస్తారు ) అని చిన్నప్పటినుండి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీ పిల్లలకు నేర్పిస్తున్నారా ? మీరు పైకి రాయి విసిరి ,అది చాలా పైకి వెళ్లిందని ఆనందించేలోపే ఆ రాయి మీకే తగలొచ్చు .ఎమంటారు ?? అర్ధం అయిందనుకుంటాను ..ఆ అది విషయం మరి .

మీ పిల్లలు పిల్లలేగా అని పక్కింటి పిన్నిగారితోనో ,ఎదురింటి ఎల్లమ్మగారితోనో ,వెనకింటి వెంకాయమ్మతోనో గోసిప్పులు అంటే ఎవరింటికి ఎవరు వస్తున్నారు ,ఎవరు ఎవరితో లేచిపోయారు,ఎవరు లేచిపోయి మళ్ళీ కూర్చుండిపోయారు,ఎవరెవరికి  ఏమేమి గొడవలు అవుతున్నాయి ,ఎవరి ఇంట్లో ఎవరు ఎవరిమీద కేసులు పెట్టేరు ,ఎవరి జీతం ఎంత ,ఎవరు ఏ కులం వారు ,ఎవరికి ఎంత అప్పులు ఉన్నాయి ,ఇలా ఇలా పనికిమాలిన మాటలు మాట్లడుతూ ..అవతలివారు వారికి తెలిసినా తెలియకపోయినా ..అయ్యో పాపం అడిగారు కదా ..ఏదోకటి చెప్పాలి అని మీపై ఎనలేని జాలితో అవతలి వారిగురించి ఉన్నవి లేనివి కల్పించి మిక్సర్ మసాలా లాగా కొంచెం స్పైసీగా కారం కారంగా ..పుల్ల పుల్లగా నిమ్మ చెక్క పిండి ..పచ్చటి కొత్తిమీరతో గార్నిష్ చేసి ..లైటుగా ఉల్లిపాయ ముక్కలు చల్లి ..అబ్బా అనిపించేలా నోరూరించేలా ..."మీ ఇంటి వంట.. పక్కింటి కడుపు మంట..ఉండాలి ప్రతి ఇంట " ప్రొగ్రాము లాగా ఎపిసోడులు ఎపిసోడులుగా చెప్పుకుంటున్నారా ??
        ఐతే ఒక పది ఇరవై సంవత్సరాలలో మీ ప్రోగ్రాముకు సీక్వెల్ తొ మీ పిల్లలు ఎదిగి అవే మాటలు మాట్లాడుకుంటూ ..మీరు అదే ఇంట్లొ ఒక మూలన కూర్చొని మతగ్రంధాలు అరిగి చిరిగిపోయేలా చదివేస్తూ మీరు చల్లిన విత్తనాలు మొలకెత్తి ..వృక్షంగా మారి ..ఆ వృక్షంపై  వాలిన కాకులు కూస్తున్న కర్ణ కఠోరమైన శబ్దాలు మీ చెవులతో వింటూ .." ఒరేయ్  ఆపండర్రా ..ఎందుకలా గోసిప్పులు మాట్లాడుకుంటారు ..భగవన్నామస్మరణ చేయొచ్చుగా నాలాగా ..అంటూ .." లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా .." అంటూ ఉపదేశం ఇవ్వొచ్చు అనుకుంటున్నారా ??? ఐతే కంగ్రాట్యులేషన్స్ అండీ ..." బెస్ట్ పెరెంట్స్ అఫ్ ది ఇయర్ మీరే !!!! "